ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..ఎయిమ్స్‌కు తరలింపు..

Spread the love

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గైనిక్ సమస్యతోపాటు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ మేరకు జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు వైద్య పరీక్షల నిమ్మిత్తం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 

ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. కాగా, కవిత గత కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జూలై 16న కూడా అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం కవిత తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మళ్లీ అనారోగ్యం బారిన పడడంతో పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గత 5 నెలలుగా జైలులోనే ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 27కు వాయిదా వేసింది. అయితే బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 16న ఢిల్లీలోని రెస్య్కూ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా..కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *