ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టుతో సర్వం కోల్పోయిన వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటదని హామీ ఇచ్చారు. శుక్రవారం రైల్వేకోడూరు పర్యటన ముగించుకుని రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామానికి చేరుకున్న ఆయన.. అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామసభలో బాధితులతో మాట్లాడారు. మూడేళ్ల కిందట అన్నమయ్య డ్యాం తెగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినా ఇప్పటివరకు తమకు పునరావాసం కల్పించలేదంటూ బాధితులు ఆయన ఎదుట వాపోయారు.
వెంటనే స్పందించిన పవన్.. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కూడిన ఓ కమటీ మరోసారి వరద గ్రామాల్లో పర్యటిస్తదని భరోసా ఇచ్చారు. బాధితులు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలంటూ వారికి సూచించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.