నిరసనలకు ముగింపు పలికిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్యులు..

Spread the love

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన కోల్‌కతా వైద్య విద్యార్థులు తాజాగా తమ ఆందోళనను విరమించారు. శనివారం నుంచి విధుల్లో చేరతామని ప్రకటించారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పలు డిమాండ్లతో 42 రోజులుగా వీరు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

 

రెండు రోజుల క్రితం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలో జూనియర్ వైద్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లకు మమత అంగీకరించారు. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు.

మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెడ్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్‌లను వారి పోస్టుల నుంచి తొలగించనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అనంతరం రెండో విడతగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ తో సమావేశమయ్యారు వైద్యులు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లలో ప్రభుత్వం చాలా వాటిని నెరవేర్చడంతో వైద్య విద్యార్థులు తమ ఆందోళనను ముగిస్తున్నట్లు గురువారం వెల్లడించారు.

 

అయితే, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్వస్థ భవన్ నుంచి సీబీఐ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆర్జీ కర్ అత్యాచారం,హత్య కేసుకు న్యాయం చేయాలని వైద్యులు కోరుతున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు, జవాబుదారీతనం డిమాండ్ చేయడం లక్ష్యంగా ఈ మార్చ్ జరగనుంది. మార్చ్ తరువాత, స్వస్థ భవన్ వద్ద ప్రస్తుత ధర్నా మధ్యాహ్నానికి ముగియనుంది. ఇది వారి నిరసన ప్రయత్నాలలో కొత్త దశను సూచిస్తుంది.

 

మాజీ ప్రిన్సిపల్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది. బంగాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బెంగాల్ మెడికల్‌ యాక్ట్‌-1914లోని పలు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమబెంగాల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు తెలిపారు. కాగా, సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ విభాగాన్ని ఇటీవల కోరింది.

 

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించగా.. మాజీ ప్రిన్సిపల్ నుంచి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సందీప్‌ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై జూనియర్‌ వైద్యులు స్పందించారు. ఇది మరణించిన తమ సోదరి సాధించిన విజయంగా అభివర్ణించారు. ఘోష్‌ అరెస్టైన మరుసటి రోజే అతని మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు కావాల్సి ఉందన్నారు. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *