జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ అజెండాను ఎట్టి పరిస్థిల్లోనూ అమలు కానివ్వబోమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మేనిఫెస్టో చూసి పాకిస్థాన్ సంబరాలు చేసుకుటోందని అన్నారు.
ప్రజాస్వామ్యంపై జమ్మూకాశ్మీర్ యువతకు విశ్వాసం ఏర్పడిందని, వారి ఓటు మార్పు తేగలదని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందన్నారు. జమ్మూకాశ్మీర్ యువత నిస్సహాయ స్థితిలో లేదన్నారు. మోడీ ప్రభుత్వంలో వారంతా సాధికారత సాధిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జమ్మూకాశ్మీర్ బీజేపీ భారీ ప్రకటనలు చేయటం సంతోషంగా ఉందన్నారు.
నైపుణ్యాభివృద్ధిలో, ఉద్యోగాల కల్పనలో అవకతవకలకు తావులేకుండా బీజేపీ చూస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు అనే మూడు పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. వారి స్వార్థం కారణంగా కాశ్మీరీ ప్రజలకు పెను నష్టం వాటిల్లిందన్నారు.
1980ల్లో ఏం జరిగిందో మర్చిపోయారా? ఆ మూడు పార్టీలు (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ) జమ్మూకశ్మీర్‌ను వారి సొంత సామ్రాజ్యంగా భావించాయి. ఆ మూడు కుటుంబాలవారు (గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కుటుంబం) కాకుండా ఇంకెవర్నీ రాజకీయాల్లోకి రానిచ్చేవారు కాదు. విద్యకు దూరమైన మన యువత చేతిలో వారు రాళ్లు పెట్టారు. వారి స్వప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతి శక్తినీ ఓడించి తీరుతామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, ఎన్సీల మేనిఫెస్టోకు పాకిస్థాన్ రక్షణ మంత్రి మద్దతు తెలిపారని.. ఆ పార్టీలు పాకిస్థాన్ అజెండాను అమలు చేస్తున్నాయంటూ ప్రధాని మోడీ మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాదం, ఉగ్రవాదం క్షీణించాయని.. వాటిని ఇంకా పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఈ భూమ్మీద ఏ శక్తీ ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకురాలేదని తేల్చిచెప్పారు.