జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. ఆర్మీ వాహనంపై దాడి..

Spread the love

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు. ఎల్‌వోసీకి సమీపంలో ఉండే బొటాపత్రి ప్రాంతంలోని నాగిన్ పోస్ట్‌కి దగ్గరలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులతో పాటు ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు (సహాయ కార్మికులు) గాయపడ్డారు. వైద్య కోసం తక్షణమే హాస్పిటల్‌కు తరలించాం. ఎన్‌కౌంటర్‌లో పురోగతిలో ఉంది’’ అని పేర్కొంది.

 

ఈ ఘటన ఉగ్రవాదుల చొరబాట్లపై ఆందోళన రేకెత్తిస్తోంది. సరిహద్దులో చొరబాట్లు మళ్లీ మొదలయ్యాయని ఆర్మీ మూలాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని సరిహద్దు వెంబడి బలగాలు నిఘాను పెంచాయి. నిజానికి ఈ ప్రాంతమంతా ఆర్మీ ఆధీనంలోనే ఉంటుంది. వేసవి ప్రారంభంలో ఒక ఉగ్రవాద గ్రూపు భారత్‌లోకి చొరబడి అఫ్రావత్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలలో దాగినట్టు గతంలో రిపోర్టులు వెలువడ్డాయని ఆర్మీ అధికారులు చెప్పారు.

 

కాగా ఉగ్రవాదుల దుశ్చర్యపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలో ఇటీవల వరుస ఉగ్ర దాడులు జరుగుతుండడం కలవరపరుస్తోందని ఆయన అన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని బొటాపత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడిపై చాలా దురదృష్టకర వార్త విన్నానని అన్నారు. మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ దాడిని ఖండించారు.

 

కాగా గత ఐదు రోజుల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన రెండవ ఉగ్రవాది ఇది. గత ఆదివారం గందర్‌బల్ జిల్లాలో గగాంగీర్ ప్రాంతంలోని జెడ్-మోర్ సొరంగం నిర్మాణ స్థలంలో కార్మికుల క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు, ఒక డాక్టర్ చనిపోయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *