ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..?

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఈ యాప్‌లో ఒకటి రెండు మార్పు చేర్పులను సూచించారు.

 

మంత్రి సూచనల మేరకు మార్పులు చేసి వచ్చే వారంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి చెప్పారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకు చేయాల్సిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

 

గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని సూచించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయింపు వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంతవరకు వినియోగించుకోవాలన్నారు. పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

 

కాగా, ఇందిరమ్మ ఇళ్లపై.. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నెలఖారు అయ్యేసరికి ఎలానైనా అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3500 నుంచి 4000 ఇళ్లను మంజూరు చేయ‌బోతున్నామ‌ని మంత్రి పొంగులేటీ ఇటీవల ప్రకటించారు.

 

వ‌చ్చే నాలుగు సంవ‌త్సరాల‌లో రాష్ట్రంలో అర్హులైన పేద‌వారంద‌రికీ ఇందిరమ్మ హౌసింగ్స్కీంలో భాగంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడ‌మే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమ‌ని మంత్రి తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో కనీసం 20 ల‌క్షల ఇళ్లకు త‌గ్గకుండా నిర్మిస్తామ‌న్నారు. కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు, ఎలాంటి తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వడ‌మే ఈ ప్రభుత్వ ఆశ‌య‌మ‌ని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావ‌ల‌సిన వాటా, నిధులు రాబట్టుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *