దేశవ్యాప్తంగా ధరలు మంట పుట్టిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం కూడా ఆకాశాన్నంటుతోంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన పరిమితుల్ని సైతం దాటిపోయి ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోంది. దీన్ని ఎలా అదుపు చేయాలో తెలియక కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణం వల్ల ఎదురవుతున్న సమస్యల్ని ప్రస్తావిస్తూ ఓ ఎక్స్ యూజర్ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ట్వీట్ చేశారు. దీంతో ఆమె వెరైటీగా స్పందించారు.
తుషార్ శర్మ అనే ఓ ఎక్స్ యూజర్ తాజాగా దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని భావించారు. దీంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో దేశం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలను, సహకారాన్ని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, అయితే మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనాన్ని అందించాలని మిమ్మల్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నానంటూ అందులో పేర్కొన్నారు. అలాగే ఇందులో ఉన్న కఠిన సవాళ్లను తాను అర్థం చేసుకున్నానని, కానీ ఇది హృదయపూర్వక అభ్యర్థన మాత్రమేనంటూ పేర్కొన్నారు.
దీనిపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మీ మంచి మాటలు, మీ అవగాహనకు ధన్యవాదాలంటూ మొదలుపెట్టారు. నేను మీ ఆందోళనను గుర్తించి అభినందిస్తున్నానంటూ నిర్మల తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీది స్పందించే ప్రభుత్వమని, ప్రజల గొంతులను వింటుందని తెలిపారు, అలాగే వాటిపై చర్యలు తీసుకుంటుందన్నారు. మీ అవగాహనకు మరోసారి ధన్యవాదాలు, మీ అభిప్రాయం విలువైనది అంటూ ముగించారు. అయితే మధ్యతరగతికి ఊరటనిచ్చేందుకు ఏం చేయబోతున్నారో మాత్రం ఆర్ధిక మంత్రి చెప్పలేదు.