తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కూడా పలు అంశాలపై వాడీవేడి చర్చలు జరిగాయి. భూ భారతి బిల్లుపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. ధరణి అనేక సమస్యలకు కారణమైందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి రైతులను తమ భూములకు దూరం చేసిందని అన్నారు.
లోపభూయిష్టంగా ఉన్న ధరణితో రాష్ట్ర ప్రజల సమాచారాన్ని దేశం దాటించారని ఆరోపించారు. ఐఎల్ఎఫ్ఎస్ (ILFS) టెరాసిన్ అనే కంపెనీని ఫిలిప్పీన్స్కు చెందిన మరో కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. రకరకాల కంపెనీలు ఇందులో వాటాలు తీసుకున్నాయని తెలిపారు. ఒక శాతం వాటా ఉన్న గాదె శ్రీధర్ రాజు కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారన్నారు. శ్రీధర్ రాజు.. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడని సీఎం రేవంత్ తెలిపారు.
ధరణి పోర్టల్ కేసీఆర్ సర్కారు తెచ్చింది కాదన్నారు సీఎం రేవంత్. 2010లో ఒడిశా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకొస్తే.. ఒడిశా ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్ఐసీ, కాగ్ సూచించాయని తెలిపారు. అనుభవం లేని ఐ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థకు అప్పగించొద్దని హెచ్చరించిందని సీఎం రేవంత్ తెలిపారు.
క్రిమినల్ కేసులున్న సంస్థలను ఐఎల్ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థ టేకోవర్ చేసుకుందన్నారు. అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతను అప్పగించారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ దక్కగానే ఈ సంస్థ పేరు, యాజమాన్యం మారిందని తెలిపారు. ఫాల్కన్ హెచ్బీ అనే ఫిలిప్పీన్ కంపెనీ, ఆ తర్వాత సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చాయన్నారు. 50 లక్షల మంది రైతులు, వారి భూముల వివరాలను ఈ సంస్థ చేతిలో పెట్టారని సీఎం రేవంత్ ఆరోపించారు.
ట్యాక్స్ హెవెన్ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్ పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జీన్ ఐలాండ్ మీదుగా ధరణి పోర్టల్ తిరిగిందన్నారు పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా… సీఈవోగా మాత్రం గాదె శ్రీధర్ రాజే ఉన్నారని సీఎం రేవంత్ చెప్పారు.
భూ భారతి బిల్లుకు సభ ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ భూ భారతి బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ధరణి స్థానంలో భూ భారతి కొనసాగనుంది.