చిక్కడపల్లి విచారణలో అల్లు అర్జున్ కు ప్రశ్నల వర్షం..! అల్లు అర్జున్ కీలక హామీ..

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ పైన చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు పైన రచ్చ కొనసాగుతుంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను ఈ కేసులో ఏ 11గా చేర్చారు.

 

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్

ఇక ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం ఆపైన కోర్టు ఆయనకు రిమాండ్ విధించి జైలుకు పంపడం మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రావడం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, తో పాటు మామతో కలిసి తన లాయర్లతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం వెళ్లారు.

 

విచారణలో అల్లు అర్జున్ కు ప్రశ్నల వర్షం

విచారణలో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను పలు అంశాలపై ప్రశ్నించినట్టుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తుంది. సుమారు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ విచారణ కొనసాగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పైన పోలీసులు చెబుతున్న దానికి అల్లు అర్జున్ చెబుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉండడంతో మళ్లీ నేడు విచారణలో భాగంగా ఆయనను పోలీసులు అనేక విధాలుగా ప్రశ్నించారు.

 

చిక్కడపల్లి పోలీసులకు అల్లు అర్జున్ హామీ

న్యాయవాదుల సమక్షంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు అల్లు అర్జున్ ను ఆదేశించగా, తప్పకుండా సహకారం అందిస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారని తెలుస్తుంది.

 

ఆ వీడియో ఆధారంగా ప్రశ్నాస్త్రాలు

సెంట్రల్ జోన్ డిసిపి ఆకాంక్ష యాదవ్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో జరిగిన ఘటన విషయంలో వివిధ అంశాల పైన విచారణ చేశారు. ఇటీవల పోలీసులు విడుదల చేసిన పది నిమిషాల వీడియోను ఆధారంగా చేసుకొని నేడు పోలీసులు అల్లు అర్జున్ ను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్లో పేర్కొన్న అంశాల పైన కూడా విచారించినట్లు తెలుస్తుంది.

 

విచారణకు ముందు లీగల్ టీమ్ తో సంప్రదింపులు

తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నాడు నోటీసులు ఇచ్చి మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్లో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నేడు అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. .అంతకుముందు పోలీసుల నోటీసులపైన అల్లు అర్జున్ తన లీగల్ టీం తో చర్చలు జరిపారు.

 

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు

దాదాపు మూడున్నర గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ తిరిగి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు అల్లు అర్జున్ ను విచారిస్తున్న క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను సైతం నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *