శ్రీతేజ్ తండ్రికి పర్మినెంట్ జాబ్… హామీ ఇచ్చిన దిల్ రాజు..

Spread the love

అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.

 

కిమ్స్‌లో చికిత్స

 

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

 

దిల్ రాజు పరామర్శ..

 

తాజాగా శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పరామర్శించారు. తండ్రి భాస్కర్‌తో మాట్లాడారు. డాక్టర్లను కలిశారు. వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. హెల్త్ రిపోర్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య వివరాలు, అందుతున్న వైద్య చికిత్స గురించి ఆరా తీశారు.

 

అమెరికా నుంచి..

 

మొన్నటి వరకు దిల్ రాజు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికాలో నిర్వహించిన ఈవెంట్‌లో హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, ఇతర టెక్నీషియన్లతో కలిసి పాల్గొన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.

 

అన్ని సర్దుకుంటాయి..

 

కొద్దిసేపటి కిందటే కిమ్స్‌కు వెళ్లారు. శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు దిల్ రాజు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగామని, ఒకట్రెండు రోజుల్లో ఆయనను కలుస్తామని అన్నారు. చిత్ర పరిశ్రమ తరఫున పెద్దలందరూ కలిసి వెళ్తామని చెప్పారు. అనంతరం అల్లు అర్జున్‌ను కూడా కలుస్తానని మధ్యేమార్గాన్ని కనుగొంటామని పేర్కొన్నారు.

 

బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంపై..

 

ప్రస్తుతం శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ను ఎలా ఆదుకోవాలనే విషయాన్ని పరిష్కరించాల్సి ఉందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని, తానే దగ్గరుండి దీన్ని లీడ్ చేస్తానని చెప్పారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని, రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని తనతో చెప్పారని దిల్ రాజు వివరించారు. టాలీవుడ్ మొత్తం భాస్కర్‌కు అండగా ఉంటుందని అన్నారు.

 

వారధిలా..

 

అటు చిత్ర పరిశ్రమకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి తనకు ఇచ్చారని, చర్చలు- సంప్రదింపులతో పరిష్కారాన్ని కనుగొంటామని దిల్ రాజు అన్నారు. ఆ కుటుంబ బాధ్యతను తీసుకుంటున్నానని, శ్రీతేజ్ త్వరగా రికవరీ అవుతారని పేర్కొన్నారు.

 

ఇండస్ట్రీకి అన్ని రకాలుగా మద్దతు..

 

భాస్కర్‌ను చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చి, అతనికి శాశ్వత ఉద్యోగాన్ని కల్పించాలని భావిస్తోన్నానని, ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని దిల్ రాజు అన్నారు. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెట్టిందని చెబుతున్నారని, ఇందులో వాస్తవం లేదని దిల్ రాజు పేర్కొన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అన్ని రకాలుగా ఇండస్ట్రీకి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *