పంచాయతీలలో పవన్ కళ్యాణ్ కీలక మార్పులు.. ఏంటంటే..?

Spread the love

ఏపీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖపై తన ముద్ర చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీల బలోపేతంతో పాటు గ్రామ స్వరాజ్యం సాధన కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాల ప్రక్షాళన తరహాలో పంచాయతీల్లోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే దీన్ని అమల్లో పెట్టేశారు.

 

రాష్ట్రంలోని పంచాయతీల్ని బలోపేతం చేసేందుకు నిధులు ఇస్తున్న కూటమి సర్కార్.. అలాగే పాలనా పరంగా చేయాల్సిన మార్పుల్ని కూడా వేగంగా చేసేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ మూడు పంచాయతీలకు ఒక సెక్రటరీ విధానం స్ధానంలో ప్రతీ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శి ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ నుంచే అమల్లోకి తీసుకు రాబోతున్నారు.

 

గత ప్రభుత్వంలో పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీంతో పాటు గ్రామ సచివాలయాల్ని ఏర్పాటు చేశారు. వీటి వల్ల గ్రామ స్దాయిలో గందరగోళం పెరిగింది. దీన్ని క్లియర్ చేసేందుకు క్లస్టర్ విధానంలోనూ మార్పులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే రెండు, మూడు పంచాయతీలకు ఉన్న ఒక కార్యదర్శి స్ధానంలో ప్రతీ పంచాయతీకి కార్యదర్శి ఉండేలా చూస్తారు.

 

క్లస్టర్ విధానంలో పంచాయతీ కార్యదర్శుల పని విభజన సరిగా లేదు. దీంతో ఒకరిపై పని భారం ఎక్కువగా ఉంటే ఇంకొందరిపై తక్కువగా ఉంది. దీన్ని సరి చేసి జనాభా ఆధారంగా క్లస్టర్ వ్యవస్ధలో మార్పులు తెస్తారు. అప్పుడు జనాభా ఎక్కువగా ఉంటే పంచాయతీలపై గ్రేడ్ 1 నుంచి ప్రారంభించి తక్కువగా ఉండే పంచాయతీలకు వచ్చే సరికి గ్రేడ్ 5 కార్యదర్శుల వరకూ నియమిస్తారు. తద్వారా స్థానికంగా ఉండే తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సమస్యలు అధిగమించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *