బీజేపీ అజెండాలో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి అమలును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇవాళ అమల్లోకి తెచ్చేసింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఇవాళ ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఆయనకు బీజేపీ అజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అమలుతో సీఎం పుష్కర్ సింగ్ థామీ స్వాగతం పలుకుతున్నారు. అయితే ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి ? అది ఎలా అమలు కాబోతోందో ఓసారి చూద్దాం..
ఇవాళ మధ్యాహ్నం 12.30కి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామీతో కలిసి ప్రధాని మోడీ కామన్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం వెబ్ సైట్ ప్రారంభించబోతున్నారు. దీంతో దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. అలాగే బీజేపీ అజెండాలోని ఓ కీలక అంశం అమలుకు నోచుకుంటోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆమోదం కూడా పొందిన ఈ ఉమ్మడి పౌరస్మృతికి ఇతర అడ్డంకులేవీ ఉండవు.
ఉమ్మడి పౌరస్మృతితో ఎవరిపై ప్రభావం?
ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టం ప్రకారం ఉమ్మడి పౌరస్మృతి రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. అలాగే ఉత్తరాఖండ్ వెలుపల నివసిస్తున్న రాష్ట్ర వాసులకూ ఇది వర్తిస్తుంది. అయితే ఎస్టీలతో పాటు ఈ చట్టం అమలు అథారిటీ మినహాయించబడిన వ్యక్తులు, జాతులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి?
ఉమ్మడి పౌరస్మృతి అంటే మతం, లింగం, కులంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వర్తించే ఏకరీతి వ్యక్తిగత చట్టాల సమూహం. పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాలను ఇందులో కవర్ చేస్తారు. వీటి విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మిగతా చట్టాలన్నీ ఆటోమేటిగ్గా రద్దవుతాయి. అయితే ఈ చట్టం “అసాధ్యమైనది”, ‘ప్రజలను మతపరంగా విభజించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ లో అమలు ఇలా..
ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలుతో స్థానికులు వచ్చే వారం నుండి వివాహాలు, విడాకులు, వారసత్వ హక్కులు, సహజీవనం, దాని రద్దును నమోదు చేసుకోవడానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను వాడుకోవచ్చు. మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఇంటి వద్ద నుంచే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దరఖాస్తు స్టేటస్ గురించిన సమాచారాన్ని ఇ-మెయిల్ , ఎస్సెమ్మెస్ ద్వారా పొందవచ్చు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పౌరులు ఫిర్యాదులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.