భారత్ కు చెందిన అధునాతన క్షిపణిని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ముందుకొచ్చింది. ఈ మేరకు భారత్- ఇండోనేషియా మధ్య రూ. 3800 కోట్ల ఒప్పందం జరిగింది. బ్రహ్మోస్ క్షిపణితో ఇండోనేషియా రక్షణ వ్యవస్థ మరింత దృఢంగా మారనుంది. అంతేకాక ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
జనవరి 26 రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రధాని ప్రభోవో సుభియాంటో భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ది చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రధానకార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఇండోనేషియా వైమానిక దళాధిపతి మహమ్మద్ అలీ కూడా ఉన్నారు. ఈ మేరకు అక్కడ జరిగిన సమావేశంలో బ్రహ్మోస్ క్షిపణి పూర్తి వివరాలను భారత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బ్రహ్మోస్ ప్రత్యేకతలు..
బ్రహ్మోస్.. అనేది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. అత్యాధునిక స్టెల్త్ పరిజ్ఞానం కలిగిన మధ్యశ్రేణి రామ్ జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని భారతదేశం-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణి మ్యాక్ 2.8 వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఈ మిసైల్ స్పీడ్ ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్గా గుర్తింపు పొందింది.
భూమి, నౌకలపై దాడి చేయగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఈ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. ఇది 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. దీనికి కొనసాగింపుగా బ్రహ్మోస్ -2ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఇండో- రష్యన్ బ్రహ్మోస్ ప్రోగ్రామ్ సీఈఓ అతుల్ రాణే తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసిన మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఆ తర్వాత వియత్నాం కూడా కొనుగోలుపై ఒప్పందం చేసుకుంది.