కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో నిందితుడు అరెస్ట్..! అసలేం జరిగిందంటే..?

Spread the love

హర్యానాకు చెందిన యువ కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మార్చి 1న రోహ్‌తక్ -ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో ఓ సూట్ కేసులో హిమానీ నర్వాల్ మృతదేహం లభ్యం అయింది. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి హర్యానా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ బృందం సోమవారం ఒక నిందితుడిని పట్టుకుంది.

 

ఆ వ్యక్తి తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు హిమానీ నర్వాల్ కు పరిచయం ఉన్న వ్యక్తేనని వారు తెలిపారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీ కోరతామని సిట్ వెల్లడించింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

హిమానీ మృతదేహం దొరికిన రెండు రోజుల తర్వాత ఢిల్లీలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు సచిన్ అని తెలిసింది. అరెస్ట్ సమయంలో సచిన్ వద్ద హిమాని నర్వాల్ మొబైల్ ఫోన్ కూడా దొరికింది. హర్యానాలోని బహదూర్ గఢ్ నివాసి అయిన సచిన్.. హిమాని నర్వాల్ తన నుంచి లక్షలు వసూలు చేసిందని.. మరిన్ని డబ్బులు డిమాండ్ చేసిందని పోలీసులకు చెప్పాడు.

 

ఆమె తనను బ్లాక్ మెయిల్ చేసిందని కూడా ఆరోపించాడు. నిరంతరం డబ్బు డిమాండ్ చేయడం వల్లే రోహ్ తక్ లోని ఆమె నివాసంలో హిమానిని చంపానని సచిన్ ఒప్పుకున్నాడు. హిమాని నర్వాల్ రోహ్‌తక్ లోని విజయ్ నగర్ లోని తమ పూర్వీకుల ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిసింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న చిత్రాలు వైరల్ కావడంతో ఆమె వెలుగులోకి వచ్చింది.

 

హిమాని మృతదేహం దొరికిన సూట్‌కేస్ ఆమె నివాసం నుంచి వచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. హిమానిని చంపి, ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి బస్ స్టాండ్‌లో వదిలేశానని సచిన్ పోలీసులకు చెప్పాడు. అంతకు ముందు హిమాని కుటుంబం తనను హత్య చేసిన హంతకులను అరెస్ట్ చేసే వరకు ఆమె మృతదేహాన్ని దహనం చేయడానికి నిరాకరించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత.. హిమాని కుటుంబం మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *