తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం సంచలనంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. ఈ విధ్వంసాన్ని తాను ఏ మాత్రం అంగీకరించలేనిదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మద్దతు విద్యార్థులు, పౌరులకే ఇవ్వనున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విద్యాసంస్థల భూములను వ్యాపార అవసరాల కోసం తాకట్టు పెట్టడం అత్యంత దౌర్భాగ్యమైన పరిణామమని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఇది తక్షణమే ఆగాలి. విద్యార్ధుల హక్కులను హరిస్తే, భవిష్యత్ తరం ప్రశ్నించకుండా ఉండదన్నారు. ప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థ మీద నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
అయితే మరోవైపు హెచ్ సీయూ పరిధిలోని ఆ 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని క్లారిటీ ఇచ్చింది. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. విద్యార్థులను కొన్ని రాజకీయ శక్తులు స్వలాభం కోసం కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది.