దేశంలోనే తొలిసారి… రైల్లో ఏటీఎం..!

Spread the love

ముంబ‌యి నుంచి మ‌న్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర త‌న ఏటీఎంను అమ‌ర్చింది. భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో ఇలా రైలులో ఏటీఎం ఏర్పాటు చేయ‌డం ఇదే తొలిసారి. ఏసీ చైర్ కార్ కోచ్ చివ‌ర‌లో సాధార‌ణంగా ఉండే ప్యాంట్రీ (చిన్న గ‌ది)లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనికి ప్ర‌త్యేకమైన ష‌ట‌ర్‌ను అమ‌ర్చారు. ఇప్ప‌టికే దాని ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో భారతదేశంలో తొలిసారిగా ఏటీఎం సేవ‌లు క‌లిగిన ట్రైన్‌గా పంచవటి ఎక్స్‌ప్రెస్ నిలిచింది.

 

ఇక ఈ ఏటీఎం రైలు కదులుతున్నప్పుడు కూడా ప్రయాణీకులు నగదు విత్ డ్రా కు వీలు కల్పిస్తుంది. దీనిని భారతీయ రైల్వేల ఇన్నోవేటివ్ అండ్‌ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (INFRIS)లో భాగంగా ప్రవేశపెట్టారు. భారత రైల్వేల భూసావల్ విభాగం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భాగ‌స్వామ్యంతో ఈ అద్భుత‌మైన సౌక‌ర్యం సాధ్య‌మైంది.

 

“ఫలితాలు బాగున్నాయి. ప్రజలు ఇప్పుడు ప్రయాణించేటప్పుడు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం పనితీరును మేము పర్యవేక్షిస్తూనే ఉంటాము” అని భూసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఇతి పాండే అన్నారు.

 

ఇక ఈ ఏటీఎం… ఏసీ కోచ్‌లో ఉంచబడినప్పటికీ, పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని 22 కోచ్‌ల ప్రయాణికులు వెస్టిబ్యూల్స్ ద్వారా అనుసంధానించబడి ఉండటం వలన దీనిని యాక్సెస్ చేయవచ్చ‌ని ఆమె తెలిపారు. నగదు విత్ డ్రా తో పాటు ప్రయాణీకులు చెక్ బుక్‌లను ఆర్డర్ చేయడానికి, బ్యాంక్‌ ఖాతా స్టేట్‌మెంట్‌లను తీసుకోవ‌డానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చని ఇతి పాండే పేర్కొన్నారు.

 

కాగా, ఏటీఎం భద్రత కోసం దానిలో ప్ర‌త్యేక‌ షట్టర్ వ్యవస్థ అమర్చబడింది. అలాగే 24 గంటలూ సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షిస్తాయి. ప్రయాణికులలో ఈ సేవ ప్రజాదరణ పొందితే మరిన్ని రైళ్లకు విస్తరించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *