ఏసీబీ విచారణకు కేటీఆర్..!

Spread the love

BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీసు దగ్గర ఎవరినీ పోలీసులు అనుమతించలేదు. కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్ రావు వెళ్లారు.

 

ఈ నేపథ్యంలో.. ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగిందన్నది ఓసారి పరిశీలిస్తే.. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై 2024 డిసెంబర్ 19న కేసు నమోదైంది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్దంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారంటూ అప్పటి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి గతేడాది అక్టోబర్ 18న ఫిర్యాదు చేసారు. ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

 

కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం చోటు చేసుకోవడంతో కేసు నమోదుకు తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. గవర్నర్ ఆమోదించడంతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ, ఏస్ నెక్స్ట్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పురపాలకశాఖ మధ్య ఈ కార్ రేసుల కోసం 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.

 

అనంతరం జరిగిన పలు పరిణామాల్లో హెచ్‌ఎండీఏ తన సాదారణ నిధుల నుంచి 54.88 కోట్ల మేర చెల్లించాల్సి వచ్చిందన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మరీ ఈ చెల్లింపులు చేశారని ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

జనవరిలో కేటీఆర్ విచారణకు వెళ్లగా ఏసీబీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కేసులో ఏ-2గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్, ఏ-3గా హెచ్‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ ఇప్పటికే విచారించింది. కేటీఆర్‌ను మరోసారి ప్రశ్నిస్తుండటంతో ఈ కేసు తుది దశకు చేరినట్లుగా తెలుస్తుంది.

 

ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ వద్ద భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఈ క్రమంలో కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో కేబీఆర్ పార్క్ వద్ద, తదితర పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో.. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు ఆఫీస్‌లకు వెళ్లే టైం కావడంతో.. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నా.. ఆ వెహికిల్స్‌ను చూస్తుంటే.. అంత త్వరగా కాదేమో అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *