ఉపాధి హామీ పథక పరిరక్షణకు ఉద్యమాలు -ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపి

Spread the love

:

ఉపాధి హామీ పథక పరిరక్షణకు ఉద్యమాలు

 

-ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపి

 

-సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా

 

ఖమ్మం  జిల్లా ప్రతినిధి జనవరి 19 (సంచలన వార్త)

వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని కార్పొరేట్కు సానుకూలంగా వ్యవహరిస్తూ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తెలిపారు. ఉపాధి హామీ పథక పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం సోమవారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డి. రాజా మాట్లాడుతూ అనేక ఏళ్ల పాటు వామపక్ష పార్టీలు పోరాడి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సాధించాయని ఇప్పుడు బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలు 40 శాతం వ్యయం భరించాలంటూ పథకానికి తూట్లు పొడుస్తుందని ఆయన తెలిపారు. గ్రామీణ పేదల కోసం తీసుకు వచ్చిన ఈ పథకాన్ని కార్పొరేట్ సంస్థల కోసం రద్దు చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, కేరళ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పక్షాల పరిస్థితిని ఆయన వివరించారు. మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేయాలని రాజా కోరారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ నాలుగు లేబర్ కోడ్ను తీసుకు వచ్చిందని దీనిని నిరసిస్తూ ఫిబ్రవరి 12న 10 జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా జాతీయ కౌన్సిల్లో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని దీనిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

 

-నిపుణులతో చర్చించి దీనిపై కమ్యూనిస్టు పార్టీ ఒక కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా -నిర్వహించిన ఖమ్మంజిల్లా సమితితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సిపిఐ శాఖలను జాతీయ కార్యవర్గం అభినందించింది. జాతీయ కార్యవర్గంలో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు. కార్యవర్గంలో చర్చించిన నిర్ణయాలను మంగళ, బుధవారాల్లో జరిగే జాతీయ కౌన్సిల్లో చర్చించి కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.