కూసుమంచి మండలంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు… అధికారుల తనిఖీ శూన్యం… పెచ్చు మీరుతున్న మైనింగ్ మాఫియా…

Spread the love

కూసుమంచి మండలంలో
ప్రభుత్వ భూములకు రక్షణ కరువు…

అధికారుల తనిఖీ శూన్యం…
పెచ్చు మీరుతున్న
మైనింగ్ మాఫియా…
భూ బకాసురుల చేతిలో కీలుబొమ్మలుగా అధికారులు…
నిషిద్ధ ప్రాంతాలుగా ప్రభుత్వ భూములు..
ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు చెక్ పోస్ట్ లు..

స్టేట్ బ్యూరో, సంచలన వార్త, ఫిబ్రవరి 20 : కూసుమంచి మండలంలో ఏ గ్రామంలో చూసిన ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మండలంలోని గుట్టలు, బోళ్లకు పూర్తిగా రక్షణ కరువైంది. ప్రభుత్వం ఎంతో సంచలనం నిర్ణయం తీసుకొని భూ సమస్యల పరిష్కారం కోసం జీపీఓ లను నియమించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంటే అధికారులు కనీసం గ్రామాల్లో ప్రభుత్వ భూముల వైపు కన్నెత్తి చూడకపోవడంతో దళారుల దందా యదేచ్చగా కొనసాగుతోంది. మండలంలోని జుజ్జులరావు పేట గ్రామ పరిధి 219 సర్వే నెంబర్లో ఇష్టరాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం వెనక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లుగా మండల వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అక్రమ తవ్వకాలతో ప్రభుత్వానికి కోట్లలో నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలకు తావిస్తోంది. 219 సర్వే నెంబర్లు సుమారుగా 10 సంవత్సరాల నుంచి తవ్వకాలు జరుగుతున్నా అధికారులకు సమాచారం లేకపోవడం ఏంటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాకమ్మ కబుర్లు చెప్పడంపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.