తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. జనవరి 14వ తేదీన మణిపూర్‌లో ప్రారంభం కానున్న భారత్ న్యాయయాత్రలో పాల్గొనడంతోపాటు, అదే రోజున దోవోస్ వెళ్లనున్నారు. దీంతో భర్తీ కావాల్సిన కౌన్సిల్ సభ్యుల ఎంపిక విషయంలో అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం సీఎం హుటాహుటిన దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేగాక, తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. మరొకవైపు ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైనందున జనవరి 18వ తేదీలోపు నామినేషన్ వేయాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అయితే ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తే పార్టీకి ఏ మాత్రం ప్రయోజనం చేకూరుతుంది, త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఎలాంటి ప్రయోజనం చేకూరతుందో కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్రెడ్డి వివరించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మరికొందరికి నామినేటెడ్ పదవులను సంతృప్తి పర్చాలని చూస్తోంది.