దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ..

Spread the love

దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ బిజీబిజీగా ఉంది. మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ వ్యాపారులను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు.

 

మరోవైపు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్ లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి పరిచేందుకు సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దోహదపడనున్నది.

 

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఒప్పందం కుదిరింది. డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపిన అనంతరం జాయింట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజలకు ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు అన్నారు.

 

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌ నెట్‌వర్క్ ప్రపంచంలోని ఐదు ఖండాల్లో విస్తరించి ఉన్నది. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచంలో 19వది. హెల్త్‌కేర్‌, లైఫ్‌సైన్సెస్‌ నేపథ్యంతో ఏర్పాటవుతున్న మొదటి కేంద్రం కూడా ఇదే. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని సంస్థగా పేరొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *