బాలయ్య వర్సస్ తారక్..

Spread the love

ఎన్నికల వేళ టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ వర్దంతి వేళ కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ – నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ కొనసాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి కొనసాగింపుగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరో ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది తారక్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతోంది. ఎన్టీఆర్ కు తారక్ నివాళి అర్పించే సమయంలో సీఎం..సీఎం నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు.

 

ఎన్టీఆర్ కు నివాళి: టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్దంతి నేడు. ఈ రోజు వేకువ జామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. ప్రతీ ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్దంతి నాడు తారక్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. నేడు అదే విధంగా నివాళి అర్పించేందుకు తారక్ వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులకు అక్కడకు చేరుకున్నారు. తారక్ కు మద్దతుగా నినాదాలు చేసారు.

సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇచ్చారు. కానీ, తారక్ ఎక్కడా స్పందించలేదు. అప్పటికే ఘాట్ వద్ద భారీ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఆ తరువాత నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకు అక్కడకు చేరుకున్నారు.

 

తారక్ ఫ్లెక్సీల తొలిగింపు: బాలకృష్ణ అక్కడ నుంచి వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలిగించారు. బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. దీని పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

 

విజయవాడలో హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు, అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు కంటతడి పెట్టిన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్పందన పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, చంద్రబాబు పాల్గొన్న సమావేశాలతో పాటుగా టీడీపీ సభల్లో తారక్ అభిమానులు తమ హీరో జెండాలతో ప్రదర్శనలు చేస్తున్నారు. తారక్ సీఎం అంటూ నినాదాలు కొనసాగిస్తున్నారు.

 

గ్యాప్ పెరుగుతోందా: ఇక, చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ తారక్ స్పందించకపోవటం పైన నాడు బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డౌంట్ కేర్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇక, ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య సూచనలతోనే తారక్ ఫ్లెక్సీలను తొలిగించారనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది.

 

అయితే, ఫ్లెక్సీల తొలిగింపు వ్యవహారంతో బాలకృష్ణ కు సంబంధం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో చోటు చేసుకుంటున్న ఈ వరుస పరిణామాలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *