శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తుల సౌకర్యార్ధం ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన, వసతి టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
సేవా టికెట్ల విడుదల: కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరుగునుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
దర్శనం, వసతి కోసం: ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇలా బుక్ చేసుకోండి: ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు. ఇక, ఏప్రిల్, మే నెలల్లో పరీక్షల తరువాత రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది