గ్యారెంటీల అమలు, నిధుల కేటాయింపు – సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు…

Spread the love

తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానున్న వేళ గ్యారంటీల అమలు పైన రేవంత్ ఫోకస్ చేసారు. మరో రెండు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి రానున్న ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ లో ప్రతిపాదించేందుకు సిద్దమవుతున్నారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణలోని వాహనాలకు టీఎస్ స్థానంలో టీజీగా మార్పు పైన నిర్ణయం తీసుకోనున్నారు.

 

కీలక నిర్ణయాలు: తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన అమలు చేస్తామంటూ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి రూ 10 లక్షలకు పెంపు అమలు చేస్తోంది.

 

ఈ నెల 20వ తేదీ నుంచి ఏ క్షణం లో అయినా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, ఈ లోగానే మరో రెండు గ్యారంటీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి చర్చంచనున్నారు. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా స్వకీరించిన ధరఖాస్తులు..బడ్జెట్ అంచనాల పైన సమీక్ష చేయనున్నారు.

 

గ్యారంటీల అమలు: ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో..ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఈ కొత్త గ్యారంటీల అమలుకు సంబంధించి నిధులను కేటాయించాల్సి ఉంది.

 

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే రెండు పథకాల అమలు పైన నిర్ణయం తీసుకొనే విధంగా ఈ రోజు జరిగే మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. రూ 500 వంట గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పైన ఈ రోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అదే విధంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల పైన అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

 

అసెంబ్లీ సమావేశాలు: ఇక, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ పేరుతో కొనసాగుతోంది. ఇక నుంచి ఆ స్థానంలో టీజీ పేరుతో జరిగేలా ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన తరువాత అర్హులకు గ్యారంటీలను అమలు చేస్తే రూ 50 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

 

అదే సమయంలో రూ 2 లక్షల వరకు రైతు రుణ మాఫీ అంశం ఇప్పుడు కీలకంగా మారుతోంది. కేంద్ర బడ్జెట్ తరువాత రాష్ట్రానికి వచ్చే ఆదాయం పైన అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వీటితో పాటుగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ..ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రతిపాదన పైన కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *