పొత్తు వేళ బీజేపీ కండీషన్స్, చంద్రబాబు సిద్దమేనా – సీనియర్లలో టెన్షన్..!!

Spread the love

ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల లెక్కలు కీలకం అవుతున్నాయి. కొంత కాలంగా సస్పెన్స్ గా ఉన్న టీడీపీ, బీజేపీ పొత్తుపైన స్ఫష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జగన్ ను ఓడించాలంటే జనసేనతో పాటుగా కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. పొత్తు చర్చల వేళ బీజేపీ నుంచి కొత్త కండీషన్లు తెర మీదకు వచ్చాయి. ఈ సమయంలో చంద్రబాబు ఏ మేర ఆమోదిస్తారనేది పార్టీ సీనియర్లలో ఉత్కంఠకు కారణమవుతోంది.

 

పొత్తులపై స్పష్టత: ఏపీలో పొత్తులపై ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్లున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం కానున్నారు. పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో చర్చల సమయంలో పొత్తులతో బీజేపీకి కలిగే ప్రయోజనం ఏంటనేది కీలకంగా మారనుంది.

 

పార్టీకి కేటాయించే ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదనల పైన ఈ నెల 9న జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ నుంచి పొత్తులో భాగంగా 6-8 ఎంపీ స్థానాలతో పాటుగా 12-15 ఎమ్మెల్యే స్థానాలు కోరుతూ జాబితా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

 

సీట్ల సర్దుబాటు: 2014లో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు కేటాయించారు. అందులో బీజేపీ విశాఖ, నర్సాపురం స్థానాలను గెలుచుకుంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి బీజేపీ బలం పెరిగిందని భావిస్తున్న సమయంలో ఈ సీట్ల సంఖ్యను పెంచింది. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపూర్‌ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం.

 

అదే విధంగా గతంలో గెలిచిన ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా 12 స్థానాలు తగ్గకుండా అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. వీటి పైన ఈ రోజు జరిగే చర్చల్లో చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీ సీనియర్లు, ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతోంది.

 

నిర్ణయాలపై ఉత్కంఠ: పొత్తుల లెక్కల్లో జనసేనకు 25-27 స్థానాలు కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి 12-15 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా జనసేనకు 2, బీజేపీ కనీసం 5 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 40-45 అసెంబ్లీ, 7-8 ఎంపీ స్థానాలు మిత్రపక్షాలకు వెళ్తాయి. దీని ద్వారా పార్టీలో సీట్లు ఆశిస్తున్న 50 మంది పైన ఈ నిర్ణయాలు ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

 

ఎన్నికల షెడ్యూల్ వస్తున్న చివరి నిమిషంలో పొత్తులు, పార్టీల కేడర్ మధ్య సర్దుబాట్ల పైన ఇప్పుడు చర్చ సాగుతోంది. అటు జగన్ సామాజిక సమీకరణాలతో అభ్యర్దులను ప్రకటిస్తున్న వేళ చంద్రబాబు పొత్తుల విషయంలో తీసుకొనే నిర్ణయాలు..ఫలితాల పైన ఎలాంటి ప్రభావం చూపిస్ాయనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *