పోరు బాట పట్టిన కేసీఆర్..

Spread the love

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ఇక రంగంలోకి దిగారు. సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. మరి కొద్దిరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు.

 

ఇందులో భాగంగా- ఈ ఉదయం తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టారు. పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే చేసిన వ్యాఖ్యల గురించి ఇందులో చర్చించారు. చర్చ మొత్తం కూడా దీనిపైనే సాగింది. ఎనిమిది టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు.

 

కృష్ణా జలాలపై ఉద్యమించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి మా నీళ్లు మాకే అని పేరు పెట్టారు. ఇదే నినాదంతో భవిష్యత్తులో కృష్ణా జలాల కోసం పోరాటం సాగిస్తామని తేల్చి చెప్పారు.

 

ఈ భేటీ ముగిసిన అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. కాంగ్రెస్ పాలనలో నీటి హక్కులు కృష్ణార్పణం అయ్యాయంటూ మండిపడ్డారు. తెలంగాణను పోరాడి తెచ్చుకున్నదే సాగు నీళ్ల కోసమని గుర్తు చేశారు.

 

తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేసీఆర్ ఎప్పుడు రాజీపడలేదని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలను వెండి పల్లెంలో కేంద్రానికి అప్పగించిందంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం.. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారిందంటూ ఆరోపించారు.

 

జనవరి 17వ తేదీన జరిగిన భేటీలో ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రం పరిధిలోకి చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీవ్ర తప్పిదంగా అభివర్ణించారాయన. కాంగ్రెస్ అనుసరిస్తోన్న తెలంగాణ వ్యతిరేక విధానాలను ప్రతి గడపకూ తీసుకెళ్తామని తేల్చి చెప్పారు సింగిరెడ్డి.

 

కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు అప్పజెప్పడం తెలంగాణ జీవన్మరణ సమస్యకు దారితీస్తుందంటూ ఆందోళనను వ్యక్తం చేశారు. శాశ్వతంగా నీటి హక్కుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు.

 

ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే విషయంలో రేవంత్ రెడ్డి కనీసం ప్రతిపక్షాన్ని సంప్రదించలేదని నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కు తేలే వరకు ఉద్యమాన్ని వదిలి పెట్టబోమని చెప్పారు. నీటి ప్రాజెక్టుల విషయంలో అనుసరించిన విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

పదేళ్లలో కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ది చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోపే అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు దెబ్బకొట్టిందని మండిపడ్డారు. కేంద్రానికి ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు ఇవ్వడం అంటే ఆంధ్ర ప్రయోజనాలు నెరవేర్చడమేనని అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *