అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్లు అందించేదుకు ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ రైతలకు కూడా భారీ హామీలు ఇచ్చింది.
రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. అలాగే రైతు కూలీలకు కూడా సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. అన్నింటికంటే ముఖ్యంగా రుణమాఫీ చేస్తామని అన్నదాతలకు హామీ ఇచ్చింది. రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతు రుణ మాఫీపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తాజాగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెప్పారు. అధికారులు రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇది పూర్తి కాగానే రుణమాఫీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమంగా భూములు తీసుకున్న అధికారులపై విచారణ చేయాలని కోదండ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ రూ.500 ఇస్తామని వివరించారు. వరి మద్దతు ధర ప్రస్తుతం రూ.2060 గా ఉందన్నారు. రూ.2600 చెల్లిస్తామని చెప్పారు.