కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..పొన్నం వర్సెస్ కేటీఆర్..

Spread the love

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.

 

అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. అయితే, నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. పదేళ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బండారం బయటపెడ్తామని అన్నారు. సమగ్ర సర్వే వివరాలు బయటపెడితే తమకు ఖర్చు తగ్గుతుందన్నారు.

 

గత ప్రభుత్వం ఎంబీసీలకు వెయ్యి కోట్లు ప్రకటించి వెయ్యి రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదని పొన్నం విమర్శించారు. బలహీన వర్గాల కోసమే తమ పోరాటమని అన్నారు. బీసీ మంత్రిత్వ శాఖ కోసమే తాము పోరాటం చేశామన్నారు. 2011 చట్టం చేయకుండా ఓబీసీలకు కులగణన జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

 

కులగణనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేసీఆర్ అడిగారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చట్టబద్ధత లేకుంటే కులగణన సఫలం కాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉందని చెప్పారు.

 

బీసీల డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలన్నారు. దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందన్నారు. అప్పుడే కులగణన సఫలమవుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించాలన్నారు. కుల గణనపై బిల్లులు తీసుకురావాలని కేటీఆర్ సూచించారు. రెండు రోజుల్లో బిల్లు ఆమోదించుకుందామన్నారు. అయితే, కులగణనకు చిత్తశుద్ధి అవసరం కానీ.. బిల్లు కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *