చారిత్రాత్మక ఎన్నికల్లో ప్రపంచ రికార్డ్.. !

Spread the love

దేశంలో చారిత్రాత్మక ఎన్నికలను విజయంవంతంగా నిర్వహించామని కేంద్ర ఎన్నికల ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైన వేళ.. ఎన్నికల ముగింపుపై పోల్ ప్యానెల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏడు విడతలుగా నిర్వహించిన పోలింగ్ విజయవంతంగా జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారతదేశ ఓటర్లు ప్రపంచ రికార్డును సృష్టించినట్లు తెలిపారు. మొత్తం 64.2 కోట్ల మంది ఓటర్లు ఓటు వేశారని, ఈ సంఖ్య జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు అధికమని వెల్లడించారు.

 

అలాగే ప్రపంచంలోనే అత్యధికంగా.. భారత్ లో 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ దేశాల జనాభా కంటే మన ఓటర్ల సంఖ్యే అధికమని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసి.. ప్రపంచ రికార్డు సృష్టించిన ఓటర్లందరికీ రాజీవ్ కుమార్, అధికారులు స్టాండింగ్ అవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టి అభినందించారు.

 

హోమ్ ఓటింగ్ కూడా సక్సెస్ అయిందని పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లంతా ఇంటివద్దే ఉండి ఓటేసినట్లు వివరించారు. గడిచిన 4 దశాబ్దాలతో పోల్చితే.. ఈసారి జమ్మూలో కూడా భారీగా ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు రాజీవ్ కుమార్. ఘర్షణలు, అల్లర్లతో రగిలిపోయిన మణిపూర్ లోనూ ఓటర్లు కదిలి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. రేపు దేశవ్యాప్తంగా జరిగే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎక్కడా ఘర్షణలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు భద్రతా బలగాలను మోహరించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *