పవన్.. ఓ గేమ్ ఛేంజర్.. చిరు ట్వీట్ వైరల్..

Spread the love

జనసేన గెలుపు అధికారికం అయ్యింది. పిఠాపురంలో పవన్ జనసేన జెండాను ఎగురవేశాడు. ఇక సోషల్ మీడియాలో పవన్ కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలు సైతం పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

తాజాగా పవన్ కళ్యాణ్ పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు గెలుపు పై ఎమోషనల్ అయ్యాడు. పవన్ గెలిచినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. ” డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది.

 

నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది.. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు.

 

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. రాజకీయాల్లో చిరు లేకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా ఆయన ఎప్పుడు తమ్ముడుకు సపోర్ట్ గానే నిలిచాడు. ప్రజారాజ్యం పార్టీతో చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. తమ్ముడుగా పవన్ ఏది చేయాలో అది చేశాడు. అయితే అన్న చేయలనేది తమ్ముడు చేసి చూపించాడు. రాజకీయాల్లో గెలవాలంటే పవన్ లా ఉండాలని చిరు చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *