గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ భేటీ..

Spread the love

పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని.. తీసుకున్న ప్రతి రూపాయికీ జవాబుదారీతనంగా తాను వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టి నిలదీసే అధికారం ప్రజలకు ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

 

జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 

‘ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాం. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటాం.. విపక్షంగానూ ఉంటాం. టెక్నికల్ గా అదెలా సాధ్యమనేది ఆలోచిస్తాం. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తాం. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అభినందనలు’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అదేవిధంగా పిఠాపురంలో తన గెలుపు కోసం కృషి చేసిన వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కూటమిలో భాగమైన జనసేన పార్టీ కూడా చరిత్ర సృష్టించింది. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన గెలిచిన విషయం తెలిసిందే. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *