తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
బీజేపీ శ్రేణుల్లో అధికారం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డి బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎంపీ ఈటల రాజేందర్‌కు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోజనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఢిల్లీలో ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు అనూహ్యంగా బండిసంజయ్‌ని ప్రక్కన పెట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అదనంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
కిషన్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. దీంతో రెండో సారి మోదీ కేబినెట్‌కు కిషన్ రెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించి ఈటలకు బాధ్యతలు కట్టబెడతారని సమాచారం. కేంద్ర సహాయక మంత్రి అయిన బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండగా..ఆయనను ఒక పదవికే పరిమితం చేస్తారన్న చర్చ జరుగుతోంది.