ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్యామిలీ గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఉదయం 8 గంటల సమయంలో సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు స్వామివారిని దర్శించుకోనున్నారు.
అంతకుముందు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు ముఖ్యమంత్రి. మార్గం మధ్యలో వాహన శ్రేణిని ఆపి కార్యకర్తలకు అభివాదం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అభిమానులు ముఖ్యమంత్రిని చూసేందుకు తరలివచ్చారు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో గొడుగులో అతిథి గృహానికి వెళ్లారు.
అయితే సీఎం పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గాయత్రి నిలయం వద్ద సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు. వాహనం దిగి గాయత్రీ నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు టీటీడీ ఇన్‌ఛార్జ్ ఈవీ వీరబ్రహ్మం యత్నించగా.. ముఖ్యమంత్రి తిరస్కరించారు.