జమ్మూకాశ్మీర్ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..?

Spread the love

జమ్మూకాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలు.. ఝార్ఖండ్, హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది.

 

ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైనచోట కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ జూన్ 25 నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పిస్తామని ఈసీ స్పష్టం చేసింది. జులై 25న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, ఆగస్టు 9 వరకు అభ్యంతరాలను స్వీకరించిన తరువాత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 20న తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపింది.

 

కాగా, 2018లో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రద్దు అయిన తరువాత నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్ ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఈసీ ఆదేశించింది.

 

మరోవైపు హరియాణా అసెంబ్లీ గడువు నవంబర్ 11తో ముగియనున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26, ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు కూడా జనవరి, 2025తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో వారంరోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *