త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క..

Spread the love

త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 9 2023 లోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. ఐదేళ్లలో చేయలేదన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారని అన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చామన్నారు. ఈ పథకంతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు కట్టిన ఎట్టిపరిస్థితుల్లో వృథా కాకూడదని ప్రతీ పైసా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామన్నారాయన.

 

ఇప్పటికే రైతు భరోసా మీద ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే అందులో ఎవ్వరి సొంత నిర్ణయాలు ఉండవని.. అన్ని జిల్లాల ప్రజలందరితో చర్చించిన తర్వాత నివేదికి తయారు చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ నివేదిక ప్రవేశపెట్టి దానిపై చర్చించిన తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణలో సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచాలన్నదే తమ కోరిక అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

 

ఇప్పటికే రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌‌గా వ్యవహరించనుండగా, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉండనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *