భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు* *కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ*

Spread the love

*భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు*
*కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ*

కాకినాడ జిల్లా ప్రతినిధి, సంచలన వార్త,నవంబర్ 04 2026
కాకినాడ నగరంలో భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
నగరంలోని మహాలక్ష్మీనగర్‌లో ప్రధాన డ్రైనేజీ వ్యవస్థను కమిషనర్ పరిశీలించారు. డ్రైన్లలో పూడిక, ఇతర అడ్డంకులను తొలగించడంతో వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లిందని తెలిపారు. దుర్గానగర్‌లో రహదారులు నీట మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో నారాయణ స్కూల్ పరిసరాల్లో ప్రత్యేక డ్రైనేజీ క్లియరెన్స్ పనులు చేపట్టి నీటిని తొలగించినట్లు వివరించారు.
అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం లోతట్టు ప్రాంతం కావడంతో పాటు డ్రైనేజీపై ఉన్న ఆక్రమణల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడ్డాయని, వాటిని తొలగించి డ్రైనేజీని శుభ్రం చేయడంతో ప్రస్తుతం నీరు సజావుగా ప్రవహిస్తోందని చెప్పారు. ఎంతటి భారీ వర్షం కురిసినా గరిష్ఠంగా రెండు గంటల్లో వర్షపు నీటిని బయటకు పంపించే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ వెల్లడించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్విచార ఉన్నారు.