తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు కింగ్ ఫిషర్ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) తీపి కబురు చెప్పింది. తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి బీర్ల సరఫరాను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ సానుకూలంగా స్పందించిందని తెలిపింది. త్వరలోనే ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీఎల్ సంస్థ ప్రకటించింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
సెబీ రెగ్యూలేషన్స్ కి అనుగుణంగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను వెంటనే అమలులోకి తీసుకొస్తున్నట్లు యూపీఎల్ ప్రకటించింది. తాము తెలంగాణ బేవరేజెస్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదల వంటి సమస్యలకు తెలంగాణ బేవరేజెస్ సమయానుకూలంా స్పందిస్తామని హామీ ఇచ్చిందని యూబీఎల్ తెలిపింది.
అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూనే బీర్లు సరఫరా చేశామని పేర్కొంది. ధరలు సవరించాలని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)ను అనేకసార్లు కోరామని తెలిపింది. టీజీబీఎల్ నుంచి రావాల్సిన బిల్లుల బకాయిలు కూడా భారంగా మారాయని పేర్కొంది.
బీరు తయారీ ముడిసరుకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమే. అందులో 70 శాతం ప్రభుత్వ పన్నులే ఉంటాయి. కంపెనీకి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. నష్టాలతో వ్యాపారం చేయలేకనే తెలంగాణ రాష్ట్రానికి బీర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించినట్లు యూబీఎల్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
టీజీబీసీఎల్‌కు సరుకు సరఫరా చేయలేమని యూబీఎల్ తేల్చి చెప్పింది. రెండేళ్ల నుంచి రూ. 702 కోట్ల బకాయిల్ని కార్పొరేషన్ విడుదల చేయలేకపోవడం, బీరు మూల ధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యూబీఎల్ తెలిపింది. అయితే, తాజాగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో మళ్లీ కేఎఫ్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యూబీఎల్ ప్రకటించింది.