ఆదాయ వనరులుగా ఆలయాలు: సీఎం చంద్రబాబు..

Spread the love

టెంపుల్ టౌన్ తిరుపతిని జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులను సజావుగా శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోన్నామని చెప్పారు.

తిరుపతిలో ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌ పో- 2025ను చంద్రబాబు ప్రారంభించారు. అంత్యోదయ ప్రతిష్ట సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్‌, ప్రమోద్‌ సావంత్‌‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

 

హిందూ, జైన, సిక్కిజం, బౌద్ధం.. ఈ దేశ గడ్డపై పురుడుపోసుకున్నాయని, సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ఈ నాలుగు మతాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, ఆదాయ వనరులు కూడా అని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం ఆలయాల ద్వారా వస్తోందని చంద్రబాబు చెప్పారు.

 

భక్తులు హుండీలు, ఇతర రూపాల్లో భగవంతుడికి ఏ ఉద్దేశంతో మొక్కులు చెల్లించుకుంటారో.. కానుకలను సమర్పించుకుంటారో.. వాటికే ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. దీనితో పాటు ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సదస్సులను నిర్వహించడానికీ వినియోగించాల్సి ఉందని పేర్కొన్నారు.

 

సనాతన సంప్రదాయాలు, సంస్కతిని దేశ ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో పాటిస్తోండటం వల్లే దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో గల అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నామని, దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామని చెప్పారు.

 

రాష్ట్రంలో ధార్మిక కార్యక్రమాలను అమలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. దేవాలయాల అభివద్ధి కోసం ప్రజల నుండి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా అభిప్రాయ సేకరణ తీసుకుంటామని అన్నారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా ఆలయాల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

 

ఆలయాల్లో భక్తుల రద్దీని నియంత్రించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు టైమ్ స్లాట్‌ను కేటాయించడానికి వీలు పడుతుందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *