సంచలన నిర్ణయాల రేవంత్ సర్కార్… 18ఏళ్ళు పైబడిన వారందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు!!

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరొక కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల రూపకల్పనకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ చర్యలను మొదలుపెట్టింది.

 

తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయడంతో పాటు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఫోకస్ చేశారు. దీనికోసం ప్రాధమికంగా వివిధ అంశాలను వారు పరిశీలిస్తున్నారు.

 

డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, అత్యవసరమైన వైద్య సేవలను అందించడానికి కూడా వీలు కుదురుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపు, తీసుకోవలసిన విధానపరమైన నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రంలో మెరుగు పరచవలసిన వైద్య వసతులు, వైద్య ఆరోగ్య శాఖకు ఇవ్వవలసిన ప్రాధాన్యత తదితర అంశాలపై కూడా స్పష్టత వస్తుంది.

 

ప్రస్తుతం డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలపై కసరత్తును కొనసాగిస్తున్నారు. ఈ డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, ఏ ఆసుపత్రిలో నైనా రోగికి సంబంధించిన మెడికల్ రికార్డు ఈజీగా ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల సంబంధిత రోగికి సంబంధించిన మెడికల్ హిస్టరీ పూర్తిగా సదరు ఆసుపత్రి వైద్య బృందానికి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

 

దీంతో మెరుగైన వైద్యం చేయడానికి వీలు కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ డిజిటల్ హెల్త్ కార్డును ఆరోగ్యశ్రీ కార్డు తోను, ఆధార్ తోను అనుసంధానం చేసి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ఈ విధానాన్ని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలని భావించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *