పవన్ నామినేషన్.. ఉప్పాడలో భారీ సభ..!

Spread the love

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి చేబ్రోలు నుంచి ర్యాలీగా బయల్దేరి.. గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకూ వెళ్తారు.

 

అక్కడి నుంచి కీలక నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తారు. సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పవన్ హాజరై.. ప్రసంగిస్తారు. పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలుకు జనసేన శ్రేణులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో.. పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్త్ ఏర్పాట్లు చేస్తున్నారు.

 

కాగా.. కూటమి అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు ఉమ్మడి ప్రచారాలు నిర్వహించారు. నియోజకవర్గాల వారిగా నిర్వహించే ప్రచారాల్లో అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. మరోసారి జగన్ కు అవకాశమిస్తే.. రాష్ట్రాన్నే అమ్మేస్తాడని విమర్శలు చేస్తున్నారు.

 

ఇటీవల జగన్ పై జరిగిన గులకరాయి దాడి.. ఇటు ప్రతిపక్షానికీ, అటు అధికారపార్టీకి ప్రధాన అస్త్రంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి, ఇప్పుడు గులకరాయి.. ఇదంతా సింపతీ కోసమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు పన్నిన కుట్ర అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఏదేమైనా ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *