రోడ్లపై కేజ్ వీల్స్‌తో ట్రాక్టర్లకు నో ఎంట్రీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీటీఓ శంకర్ నాయక్.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిది , జూలై 19 (సంచలన వార్త)
రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, కేజ్ వీల్స్ (కేజ్ వీల్స్) అమర్చుకుని ప్రజా రహదారులపై ప్రయాణించే ట్రాక్టర్లను గుర్తిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తామని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) శంకర్ నాయక్ హెచ్చరించారు. రైతులు నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు రోడ్డు భద్రతకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
*పొలాల్లో మాత్రమే కేజ్ వీల్స్ వినియోగించాలి*
వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే ట్రాక్టర్లకు అమర్చే ఇనుప కేజ్ వీల్స్‌ను ప్రజా రహదారులపై వినియోగించరాదని డీటీఓ స్పష్టం చేశారు. కేజ్ వీల్స్‌ను పొలాల్లో మాత్రమే ఉపయోగించాలన్నారు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి సాధారణ రబ్బరు టైర్లను అమర్చుకుని మాత్రమే రహదారులపై ప్రయాణించాలని సూచించారు.
*రోడ్లకు నష్టం.. ప్రమాదాలకు కారణం*
వ్యవసాయ భూముల్లో బురద నేలల్లో ట్రాక్టర్‌కు మెరుగైన పట్టును కల్పించేందుకు కేజ్ వీల్స్ ఉపయోగపడతాయి. అయితే వాటితో బీటీ, సీసీ, గ్రామీణ రహదారులపై ప్రయాణించడం వల్ల రోడ్ల ఉపరితలం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపారు. ఇనుప కేజ్ వీల్స్ కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి, ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రహదారులు త్వరగా ధ్వంసమవడంతో పాటు ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికమవుతాయని పేర్కొన్నారు.
*ట్రైలర్‌లో తీసుకెళ్లి.. పొలం వద్దే అమర్చాలి*
రైతులు ఇంటి నుంచి పొలానికి వెళ్లే సమయంలో కేజ్ వీల్స్‌ను ట్రాక్టర్ ట్రైలర్ (తొట్టి)లో తీసుకెళ్లి, పొలం వద్ద మాత్రమే వాటిని అమర్చుకోవాలని సూచించారు. వ్యవసాయ పనులు పూర్తయిన అనంతరం కేజ్ వీల్స్‌ను తొలగించి రబ్బరు టైర్లను అమర్చుకుని తిరిగి రహదారులపై ప్రయాణించాలని తెలిపారు.
*ప్రజా ఆస్తుల పరిరక్షణ అందరి బాధ్యత*
ప్రజా రహదారులను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రహదారులు దెబ్బతినకుండా చూడటం ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం తప్పించడంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చని డీటీఓ శంకర్ నాయక్ పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, రైతులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.