Spread the love

ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు.. కీలక సూచనలు చేసిన డీటీఓ శంకర్ నాయక్.

మహబూబాబాద్ జిల్లా ప్రతినిది ఆగష్టు 24 (సంచలన వార్త)
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల బస్సు యజమానులు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లు రవాణా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీటీఓ శంకర్ నాయక్ సూచించారు.

ఇటీవల చోటుచేసుకున్న పాఠశాల బస్సు ప్రమాదాల నేపథ్యంలో జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన సెయింట్ పాల్ హైస్కూల్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని డీటీఓ శంకర్ నాయక్ స్వయంగా పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి, డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలను నడపాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల నైపుణ్యం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, విద్యార్థుల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందున డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

డీటీఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. కనీసం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న వారినే పాఠశాల బస్సు డ్రైవర్లుగా నియమించుకోవాలని, 60 సంవత్సరాలు దాటిన వారిని స్కూల్ బస్సు డ్రైవర్లుగా నియమించరాదని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. డ్రైవర్లు వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడకూడదని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ఓవర్‌లోడ్‌కు పాల్పడకూడదని స్పష్టం చేశారు.

ప్రయాణ పరిస్థితులకు అనుగుణంగా ఇండికేటర్లను వినియోగిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులను బస్సులో ఎక్కించుకునే ముందు డ్రైవర్లు బ్రేకులు సక్రమంగా పనిచేస్తున్నాయా, టైర్లలో తగినంత గాలి ఉందా, వాహనం సురక్షితంగా ఉందా అనే అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే విద్యార్థులను ఎక్కించుకోవాలని సూచించారు.

పాఠశాల యాజమాన్యాలు బస్సుల నిర్వహణతో పాటు డ్రైవర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని డీటీఓ సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని, రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంవీఐ వెంకట్‌రెడ్డి, ఎంఈఓ బుచ్చయ్య, మండల ట్రాస్మా అధ్యక్షులు నరేష్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, స్కూల్ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.