సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంటెట్ క్రియెటర్లపై దృష్టి సారించింది. 2022 చివరి నాటికి కంటెంట్ క్రియేటర్లను సపోర్ట్ చేస్తూ ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం బుధవారం ప్రకటించింది. టిక్ టాక్, యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్‌ఫామ్స్‌తో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. పోటో షేరింగ్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్స్‌లో కొన్ని టార్గెట్లు, మైలురాళ్లను అధిగమించిన కంటెంట్ క్రియేటర్లకు బోనస్ చెల్లించడానికి, కంటెంట్ ప్రొడ్యూస్ చేసే యూజర్లకు నిధులు సమకూర్చడానికి ఈ పెట్టుబడులను కేటాయిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
ఫేస్‌బుక్‌లో వీడియో క్రియేటర్లు, ఆన్ లైన్ గేమర్లు.. ఆదాయాల కోసం కొన్ని టార్గెట్స్‌ను రీచ్ అవ్వాల్సి ఉంటుంది. వీరికి నెలవారీ బోనస్ అందుతుంది. ఇది వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు.. అభిమానులు తమ క్రియేటర్లకు చెల్లించడానికి ఉపయోగించగల డిజిటల్ టిప్పింగ్ రూపంలో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ బోనస్ ప్రోగ్రామ్స్‌లో రీల్స్ ను ఉపయోగించేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి. వీడియోల ప్రభావం, పనితీరు ఆధారంగా కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదిస్తారని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రత్యర్థి ప్లాట్‌ఫాంలు మిలియన్ల మంది అభిమానులతో ప్రత్యేకత చాటుతున్నాయి. దీంతో ఈ పోటీని తట్టుకోవడానికి ఫేస్‌బుక్, కంటెంట్ క్రియేటర్లకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. టిక్ టాక్ మూడేళ్లలో వీడియో క్రియేటర్ల కోసం భారీగా ఖర్చు చేయనుంది. అయితే స్నాప్‌చాట్ గతంలో క్రియేటర్లకు ఒక మిలియన్ డాలర్లను చెల్లించింది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్ల ప్రాధాన్యాన్ని ఫేస్‌బుక్ గుర్తించింది. వారి కోసం భారీగా పెట్టుబడులను కేటాయించింది.
ఇటీవల రిలయెన్స్ జియోలో రూ.43,574 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కోసం ఈ డీల్ కుదుర్చుకుంది. తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎం సమావేశంలో గూగుల్ పెట్టుబడుల గురించి ముఖేష్ అంబానీ ప్రకటించారు. టెక్ దిగ్గజం గూగుల్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.