ఏసీబీ వలలో అటవీ శాఖ ‘పెద్ద తలలు’
ఏసీబీ వలలో అటవీ శాఖ ‘పెద్ద తలలు’..
లంచం తీసుకుంటూ దొరికిన ఎఫ్‌డీఓ, డీఆర్ఓ
చెట్ల నరికివేత కేసు మాఫీ కోసం రూ. 10 లక్షల డిమాండ్
పక్కా ప్రణాళికతో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో మెరుపు దాడి
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే 07 2016 సంచలన వార్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. రోడ్డు నిర్మాణ పనుల్లో దెబ్బతిన్న చెట్లపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన భద్రాచలం ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్ఓ కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా, పొరపాటున కొన్ని అటవీ శాఖ చెట్లు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సాకుగా చూపి, సంబంధిత కాంట్రాక్టర్ లేదా బాధ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని ఎఫ్‌డీఓ సుజాత డిమాండ్ చేశారు. చివరకు రూ. 3.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ:
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ బృందం భద్రాచలంలోని అటవీ శాఖ కార్యాలయంపై దాడి చేసింది. కార్యాలయంలో డీఆర్ఓ కృష్ణయ్య సమక్షంలో ఎఫ్‌డీఓ సుజాత రూ. 3.5 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, చేతులకు పరీక్షలు నిర్వహించగా రంగు మారడంతో లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అటవీ శాఖ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.