హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్, 16 దేశాల అతిథులు

Spread the love

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను అంబరాన్ని తాకేలా నిర్వహించాలని సిద్ధమైంది. శనివారం నుంచి మూడు రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్ (పతంగులు), స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో 16 దేశాల నుంచి నిపుణులైన 100 మంది కైట్ ప్లేయర్స్ రకరకాల గాలిపటాలను ఎగిరేయనున్నారు.

 

అంతేగాక, స్థానిక మహిళలు తయారు చేసిన సుమారు 400 రకాల మిఠాయిలు ఈ ఉత్సవాల్లో నోరూరించబోతున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ వేడుకలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. కాగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2021 నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.

 

ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, కొరియా, ఇటలీ, తైవాన్, నెదర్లాండ్ సహా 16 దేశల నుంచి నిపుణులైన అంతర్జాతీయ కైట్ ప్లేయర్ 40 మంది, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. సాధారణ గాలిపటాల కంటే భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులను ఎగురవేస్తారు. రాత్రివేళ ఎగిరే పతంగులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

 

తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి జనవరి 15 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా అధికారులు రేపు మధ్యాహ్నం కైట్ ఫెస్టివల్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరోవైపు, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగర పౌరులకు ఉచితంగా అవకాశాన్ని కల్పించారు. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావల్సిన వినోదంతో పాటు తీపి పదార్థాలను కూడా అందుబాటులో ఉండనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *