సంక్రాంతికి రికార్డులు తిరగరాసిన టీఎస్ఆర్టీసీ బస్సులు

Spread the love

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) బస్సులలో లక్షల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పారు.

 

సంక్రాంతి సందర్బంగా 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో జనవరి నెల 12, 13 తేదిల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడిపారు. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపడం జరిగింది. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పింది.

శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చడం విశేషం. అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చింది.

 

తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *