తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేసి, తానూ చేరిపోయిన వైఎస్ షర్మిలకు ఇప్పుడు పార్టీకి ఏమాత్రం ఉనికి కనిపించని ఆంధ్రప్రదేశ్ లో సైతం పోరాడాల్సిన పరిస్దితి ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తన ఎంట్రీ జీవం పోస్తుందని హైకమాండ్ తో పాటు మెజార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నా.. పార్టీలో సహజంగానే తన కుటుంబంపై దీర్ఘకాలంగా వ్యతిరేకత పెంచుకున్న నేతల్ని దారిలోకి తెచ్చుకోవడం ఇప్పుడు షర్మిలకు సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో తన పీసీసీ ఛీఫ్ పదవిని ప్రకటించేందుకు అధిష్టానానికి ఎదురవుతున్న అడ్డంకుల్ని తానే క్లియర్ చేసుకునేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నాలు ప్రారంభించారు. ఓవైపు కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటూ ఆహ్వానపత్రికలు పట్టుకుని ముఖ్య నేతల ఇళ్లకు తిరుగుతున్న షర్మిల.. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంలోనూ కనిపించారు.
మరోవైపు ఏపీలో సొంత పార్టీలో తనకు ఏమాత్రం వ్యతిరేకత లేకుండా చూసుకున్నాకే పీసీసీ ఛీఫ్ పోస్టు వచ్చేలా చూసుకోవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఇందులో భాగంగా తనపై వ్యతిరేకత గళం వినిపిస్తున్న, లోలోపల అసంతృప్తులుగా ఉన్న వారిని గుర్తించి వాళ్లను చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే షర్మిల భర్త బ్రదర్ అనిల్ తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ను కలిశారు. కుమారుడు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానపత్రిక ఇచ్చేందుకే అని చెప్తున్నా లోలోపల హర్షకుమార్ కు షర్మిలపై ఉన్న అసంతృప్తి నేపథ్యంలో చర్చించేందుకే ఆయన ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
ఇలా మరికొందరు కాంగ్రెస్ నేతలకు కూడా చేరువై తనకు మద్దతివ్వాలని నేరుగా కోరేందుకు వైఎస్ షర్మిల కూడా ఇప్పుడు సిద్దమమవుతున్నారు. ఓవైపు కుమారుడి పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూనే, మరోవైపు పీసీసీ ఛీఫ్ గా తనకు ఎలాంటి వ్యతిరేకత లేకుడా పదవి చేపడితే బావుంటుందనే కోణంలో షర్మిల అడుగులు ఉన్నట్లు అర్ధమవుతోంది. గతంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫాలో అయిన లాబీయింగ్ శైలినే కుమార్తెగా షర్మిల కూడా అనుసరిస్తుండటం ఇక్కడ విశేషం.
ఇప్పటికే మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న షర్మిలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర నేతలు పీసీసీ ఛీఫ్ పదవిపై క్లారిటీ ఇచ్చేశారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ వారంలోనే షర్మిలను పీసీసీ ఛీఫ్ గా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.