అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జరుగుతున్న చివరి బడ్జెట్ సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధాన్ని తలపిస్తున్నాయి. నిన్న శాసనసభలో రచ్చరచ్చ కొనసాగగా శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. ఇక నేడు ఏపీలో ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
జూన్ వరకు ప్రభుత్వం చేయబోయే ఖర్చులకు ఈ బడ్జెట్ ద్వారా ఆమోదం పొందనుంది. ఇక ఈరోజు బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెడతారు. అయితే ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేకత ఏమైనా ఉందా అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది.
అయితే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో కొత్త పథకాలు ఏవి ఉండవని సమాచారం. రాబోయే ఆర్థిక సంవత్సరానికి 2.86లక్షల కోట్ల బడ్జెట్ అంచనా వేయగా, ప్రస్తుతం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కింద 95వేల కోట్ల నుంచి 96వేల కోట్ల వరకు బడ్జెట్ ను ప్రతిపాదించనున్నట్టు సమాచారం. అలాగే సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ బడ్జెట్ ను శాసనసభలో మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెడతారు. ఉదయం 11గంటల 3నిమిషాలకు ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. కేవలం నాలుగు నెలల కాలానికి ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఇంతకు మించి గొప్ప ప్రత్యేకతలు ఉండవని టాక్.
వైసిపి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బడ్జెట్లో అంచనాల కంటే తక్కువగానే ఖర్చు చేస్తుంది. 2019- 2020లో 76% ఖర్చు చేసిన వైసిపి సర్కార్, 2020- 2021 లో 83%, 2021- 2022, 2022- 2023 సంవత్సరాలలో 83%, 2023 2024లో 93% ఖర్చు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. సహజంగా ప్రభుత్వం ఏదైనా భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ ఆ అంచనాలను రీచ్ కావు.
అలాగే ఈరోజు సభలో మూడు బిల్లులను ప్రవేశపెడతారు. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్ బిల్లు 2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్దీకరణ, రేషనలైజేషన్ సంబంధిత సవరణ బిల్లు 2024లను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొత్తంగా ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఆసక్తిగా మారింది.