చలో ఢిల్లీ కార్యక్రమానికి సిద్ధమైన రైతులు..

Spread the love

దేశ రాజధానిలో రైతులు మరోసారి కదం తొక్కనున్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని కోరతూ ఢిల్లీ చలోకి పిలుపు నిచ్చారు. మొదట డిమాండ్ల పరిష్కారానికి రెండు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ, చర్చలు విఫలం కావడంతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

 

ఢిల్లీ చలో కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరుతూ కేంద్రం రైతుసంఘాల నేతలతో చండీగఢ్‌ లో నిన్న చర్చలు జరిపింది. అర్ధరాత్రి వరకూ జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండా.. రైతుల సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు.

 

2020-21లో రైతుల ఆందోళనలు చేసిన రైతులపై కేసుల ఉపసంహరణకు సెంట్రల్ టీం అంగీకరించింది. అప్పటి ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుకపోతే వారికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నాయకులు గట్టిగా డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో రైతుల సంఘాల నేతలకు, కేంద్ర బృంధానికి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో.. చలో ఢిల్లీ యథాతథంగా కొనసాగుతుందని రైతు నాయకులు తేల్చి చెప్పారు.

 

రైతుల ఆందోళనలు భగ్నం చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. దేశరాజధానిలో సోమవారం నుంచే 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. నగరంలో ట్రాక్టర్లను అనుమతించేదే లేదని తేల్చి చెప్పారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌ వంటి వాటిని ఎవరూ తీసురాకూడదని స్పష్టం చేశారు. ఇక.. లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు విధించారు. ఇప్పటికే బారీ కేడ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరినీ ఢిల్లీలోకి అనుతించడం లేదు. ఢిల్లీ హర్యానా సరిహద్దులను మూసివేశారు.

 

రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ మాక్ డ్రిల్‌ను కండక్ట్ చేశారు. డ్రోన్ల సాయంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వైపుగా వెళ్తున్న ఎక్కడిక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కర్ణాటక నుంచి వెళ్తున్న 100 మంది రైతులను భోపాల్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని నిఘావర్గాలు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కనీసం 20 వేలమంది రైతులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆందోళనలు ఎలా చేపట్టాలనే దానిపై రైతుల సంఘాలు రిహార్సల్స్ కూడా నిర్వహించారు. పంజాబ్‌లో 30 సార్లు, హరియాణాలో 10 సార్లు రిహార్సల్స్ జరిగాయని నిఘా వర్గాలకు సమాచారం ఉంది. 2000 వేల ట్రాక్టర్లతో ఢిల్లీని చుట్టు ముట్టాలని రైతులు ప్లాన్ చేశారు. అయితే, ఆంక్షల సుడిగుండాన్ని దాటుకొని ఆందోళనలు కొనసాగిస్తారా? లేదా అని ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *