ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. డీబీటీ నిధుల పంపిణీపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి.. ఈ ఒక్కరోజే నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఈసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. లబ్ధిదారులకు ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. జనవరిలో లబ్ధిదారులకు ఇచ్చేందుకు లేని నగదు.. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మధ్యాహ్నం 3 గంటల్లోగా చెప్పాలని ఈసీ లేఖలో కోరింది.
ఎన్నికలకు ముందు డీబీటీ నిధులను విడుదల చేస్తే ఓటర్లు ప్రలోభానికి గురవుతారని పేర్కొంటూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నకారణంగా నిధులను పంపిణీ చేయవద్దని ఈసీ ఆంక్షలు విధించింది. దానిపై హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ ఒక్కరోజు మాత్రమే నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. 11 నుంచి 13 వరకూ ఎలాంటి నిధులు విడుదల చేయవద్దని సూచించింది.
అలాగే.. డీబీటీ కింద నిధులు విడుదల చేసే పథకాలను ప్రచారంలో వాడొద్దని కండిషన్ పెట్టింది. ఆసరా, చేయూత, వసతి దీవెన, లా నేస్తం, రైతు భరోసా పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 59 నెలలుగా ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న విద్యార్థులు, మహిళలకు కాస్త ఊరట లభించిందని అనుకునేలోగానే ఈసీ ప్రభుత్వానికి రాసిన లేఖ సంచలనమైంది. దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.